శంఖం
భారతీయ సంస్కృతిలో 'శంఖం'కు ప్రత్యేక స్థానం ఉంది. అఖండ దైవిక వస్తువులలో శంఖం ఒకటి. శంఖం అనేది రెండు సంస్కృత పదాల కలయిక. శం అంటే మంచి అని, ఖం అనగా జలం అనే అర్థం. క్షీరసాగర మధన సమయంలో దేవతలకు వచ్చిన సంపదలలో శంఖం ఒక్కటిగా పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవికి శంఖం సహోదరుడని విష్ణు పురాణం చెబుతోంది. పురాణాల ప్రకారం క్షీరసాగర మధన సమయంలో సముద్రంలో నుంచి వచ్చిన 14 రత్నాలలో శంఖం ఒకటి.
ఆధ్యాత్మికంగా శంఖం
శంఖం ఆధ్యాత్మికంగా చారిత్రకంగా కూడా ప్రసిద్ధి చెందింది. దక్షిణావర్త శంఖం ఎంతో శ్రేష్ఠమైంది. శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధ సమయంలో పాంచజన్యం అనే శంఖాన్ని పూరించాడు. అదే విధంగా అర్జునుడి శంఖాన్ని దేవదత్తంగానూ, భీముని శంఖం పౌండ్రకం అనీ, యుధిష్ఠరుని శంఖాన్ని అనంత విజయమనీ, నకులుని శంఖాన్ని సుఘోషనామంతో, సహదేవుని శంఖాన్ని మణిపుష్ప అన్న పేర్లతో పిలుస్తారని మహాభారతకథ చెబుతుంది. వైరివర్గంతో యుద్ధానికి తలపడేటప్పుడు శంఖాన్ని పూరించడమన్నది యుద్ధ నియమాలలో ఒకటి. విజయ సూచికంగా కూడా శంఖాన్ని పూరించడమన్నది ఓ ఆచారం.
లక్ష్మీ, శంఖం సముద్ర తనయలని విష్ణుపురాణం చెబుతోంది. వరుణుడు, చంద్రుడు, సూర్యుడు శంఖం యొక్క పీఠభాగంలోనూ, ప్రజాపతి ఉపరితలం మీద, గంగా సరస్వతులు ముందు భాగంలో ఉంటారు. విష్ణు మూర్తి దుష్ట శక్తులను పారద్రోలడంలో శంఖాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించాడు. అప్పటి నుంచి విష్ణుమూర్తి ఆయుధాలలో శంఖం ఒకటిగా మారింది.
నిజానికి శంఖం జలాన్ని ఉంచే మంచి కలశంగాను భావిస్తారు. ఇందులో ఉంచిన నీటిని పవిత్ర తీర్ధంగా ఉపయోగిస్తారు. శంఖంలో పోస్తేగానీ తీర్ధం కాదు అనే నానుడి మనకు తెలిసినదే. నవ నిధులు, అష్టసిద్ధులలో దీనిని ఉపయోగిస్తారు. ఫూజా, ఆరాధన, యఙ్ఞాలు, తాంత్రిక క్రియలలో శంఖాన్ని ఉపయోగిస్తారు. శంఖ ధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్టలకు, లక్ష్మీ ఆగమనానికి ప్రతీక, ధార్మిక ఉత్సవాలు, యఙ్ఞాలు, శివరాత్రి పర్వదినాలలో శంఖాన్ని స్థాపించి పూజ చేస్తారు. శంఖాన్ని పూజించడంతో పాటు శంఖంతో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అభిషేకం చేస్తారు. శంఖాన్ని పూజిస్తారు.
శంఖాలలో వివిధ రకాలున్నాయి. దీని ఆకారాన్ని బట్టి దక్షిణావర్త శంఖం, మధ్యమావర్త శంఖంగా చెప్తారు. వీటిలోనూ లక్ష్మీ శంఖం, గోముఖ శంఖం, కామధేను శంఖం, దేవ శంఖం, సుఘోష శంఖం, గరుడ శంఖం, మణిపుష్పక శంఖం, రాక్షస శంఖం, శని శంఖం, రహు శంఖం, కేతు శంఖం, కూర్మ శంఖాలు ఉన్నాయి. భారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖాన్ని, ధర్మరాజు అనంత విజయ శంఖాన్ని, భీముడు పౌండ్ర శంఖాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పక శంఖాలను, విరాటుడు సాత్విక శంఖాన్ని పూరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
పూజ గదిలో దక్షిణావర్త శంఖం
సిరి సంపదలు చేకూరాలంటే పూజా మందిరంలో దక్షిణావర్త శంఖం ఉంచాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే కుడివైపు నుంచి తెరచుకుని ఉండే శంఖమన్నమాట. దీన్ని లక్ష్మీదేవి నివాసంగా చెబుతుంటారు. ఈ శంఖం ఉన్న చోట శ్రీమహాలక్ష్మి కొలువై ఉంటుందని శాస్త్రం చెబుతోంది. అందుకే పూజగదిలో దీనిని ఉంచి, అనునిత్యం పూజించాలని చెబుతారు. ఫలితంగా దారిద్య్రం వదిలిపోతుంది. అదే విధంగా శంఖంలో పోసిన తీర్థాన్ని స్వీకరించడం వల్ల వ్యాధి బాధలు కూడా నశిస్తాయి.
ఫలితాలు
శంఖాన్ని ఊదినట్లయితే ప్రాణాయామం చేసినంత వ్యాయామం శరీరానికి కలుగుతుంది. శంఖాన్ని ఊదితే గుండె ఆరోగ్యం బాగుంటుంది. మెదడు చురుకుతనం వృద్ధి చెందుతుంది. ఊపిరితిత్తు పనితీరు, శ్వాసక్రియ బాగుంటుంది. శంఖం ఊదడం వల్ల గృహ ఆవరణలోని దుష్టశక్తులు దూరంగా పారిపోతాయి.
దీనిని పూరించేటప్పుడు వెలువడే కంపనాలతో వాతావరణంలో ఉండే రోగకారకాలైన క్రిములు నశిస్తాయి. శంఖారావం వల్ల మనిషిలో తమో, రజో గుణాలు నశించి సత్వగుణం పెరుగుతుందంటారు. అందువలనే శంఖాన్ని పూరించడం వల్ల గాని, ఆ ధ్వనిని వినడంవలన గాని ఆరు నెలల పురాణ శ్రవణం విన్న ఫలం, వేదఘోష విన్న ఫలం దక్కుతాయంటారు.
No comments:
Post a Comment
8977277742