నేటిమాట
☘️కర్మలు జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి☘️
కర్మలెన్ని ఆచరిస్తున్నా సరే తృప్తి అనేది ఎప్పటికీ కలగదు. సరిపోయినంత సంపాదించుకున్నాం. చక్కని ఇల్లు కట్టుకున్నాం. మంచి ఉద్యోగం ఉంది. బుద్ధిమంతులైన పిల్లలున్నారు అని తృప్తిపడే వాడు ఈలోకంలోనే లేడు. ఎప్పుడూ ఏదో లేని దానిని గురించే ఆలోచిస్తాడు. ఉన్నది చాలదని భావిస్తాడు. ఇంకా ఏదేదో కావాలనుకుంటాడు. తనకన్నా ఉన్నతంగా ఉన్నవాణ్ణి గురించి ఆలోచిస్తాడు. వాళ్ళతో పోలిక పెట్టుకుంటాడు. తన దగ్గర లేనివి, ఇంకొకరి దగ్గర ఉన్నవి ఏమిటో తెలిసాక ఇక ఆ లేని వాటి గురించి ఆరాటం. వాటిని సంపాదించుకోవడానికి సతమతం అవుతాడు. అది తన వల్ల సాధ్యం కాకపోతే ఇంకొకరిని దాని కోసం అభ్యర్థించడం లేదా ఇంకొకరి నుండి లాక్కోవడం.
ఇలా కొరతలతో, కోరికలతో, అసంతృప్తితో వేగిపోతుంటాడు. ఇలా ఆంతర్యంలో అసంతృప్తితో రగిలిపోయేవాడు ఏదేదో కావాలని, ఏదేదో చేయాలని సంకల్పాలు చేస్తుంటాడు. ఈ సంకల్పాలకు అనుగుణంగా కర్మలు చేస్తూ ఉంటాడు. కర్మలు చేసినప్పుడు ఫలితం అనేది తప్పకుండా వస్తుంది. అది నీవు కోరుకున్న ఫలితం కావచ్చు, కోరుకోనిది కావచ్చు. నీకు సంతోషం కలిగించేది కావచ్చు. దుఃఖాన్ని కలిగించేది కావచ్చు. కానీ ఏదో ఒకటి వస్తుంది. ఆ విషయం అందరికీ తెలుసు కూడా. కానీ అలా వచ్చిన ఫలితాన్ని, తను చేసిన పనికి తగిన పలితాన్ని కొందరు ఒప్పుకోలేరు. మరికొందరు ఆ కర్మఫలాలను అనుభవించటం వల్ల ఆ అనుభవం వాసనలుగా - సంస్కారాలుగా ముద్రపడతాయి. అనుభవించేది సుఖమైతే మళ్ళీ మళ్లీ అనుభవించాలని, దుఃఖమైతే రాకుండా తప్పించుకోవాలనీ నీలో ముద్రలు పడిపోతాయి. ఈ వాసనలే మళ్ళీ మళ్ళీ కర్మలకు ప్రేరేపిస్తాయి. సుఖాన్నిచ్చే కర్మలు చేయాలని, ఇంతకు ముందు పొందిన దుఃఖాన్ని పొందకుండా ఉండే కర్మలు చేయాలని ప్రేరణలు కలుగుతాయి. దానితో మళ్ళీ కర్మలు చేస్తావు. మళ్ళీ ఫలితం వస్తుంది. మళ్ళీ అనుభవిస్తావు. మళ్ళీ వాసనలు - సంస్కారాలు పేరుకుంటాయి. ఇదొక సైకిల్.
కర్మ -కర్మఫలం - అనుభవం - వాసన - ప్రేరణ... ఇలా ఎంతకాలమైనా చేసుకుంటూ పోవటానికి శరీరం అనుమతించదు. దేహం బలహీనమై - ఏదో ఒక నాటికి రాలిపోతుంది. అయితే దేహం రాలిపోయినా మనస్సులో ముద్రలు పడిన సంస్కారాలు - వాసనలు ఎక్కడకూ పోవు. కర్మలు చేయలేక పోయినా చేయాలనే భావన (వాసన) అలాగే ఉన్నది కాబట్టి వాటిని ఖర్చు చేసుకొవడానికి తగిన దేహాన్ని తీసుకొని మళ్ళీ ఈలోకం లోకి వస్తావు. అలా వచ్చి పూర్వ దేహంలో ఉన్నపుడు ప్రోగు చేసుకున్న వాసనల ప్రేరణతో మళ్ళీ కర్మలు చేయటం ప్రారంభిస్తావు. మళ్ళీ చక్రం తిరగటం ప్రారంభం. ఇక ఈ దేహం పోతే మరొక దేహం. ఇలా జన్మ - కర్మ - జన్మ - కర్మ వలయంలో - సుడిగుండంలో చిక్కుకొని గిరిగిర తిరుగుతూ ఉండాల్సిందే. "పునరపి జననం పునరపి మరణం పునరపిజననీ జఠరేశయనం.." అని ఆదిశంకరులు అన్నట్లు జనన మరణ రూప సంసార చక్రంలో ఇరుక్కుపోతావు. ఇదే కర్మ మహా సముద్రం. సముద్రంలో నిరంతరం అలలు వస్తూనే ఉంటాయి, వచ్చినవి ఒడ్డుకు చేరి పడిపోతూనే ఉంటాయి. మళ్లీ వెనుక నుండి వస్తూనే ఉంటాయి. ఒక్క క్షణం కూడా ఆగే పనే లేదు. అందుకే కర్మలను - జన్మలను - ఈ సంసార చక్రాన్ని సముద్రంతో పోల్చారు. కృతి మహాదధౌ పతన కారణం - కర్మ అనే మహాసముద్రంలో పడిపోవటానికి కర్మలే కారణమౌతున్నాయి.
No comments:
Post a Comment
8977277742